విత్తనమే విపత్తు నాసిరకం, నకిలీలతో నష్టపోతున్న రైతులు .నాణ్యత ధ్రువీకరణలో లొసుగులే ఆసరాగా మోసాలు

పంటకు ప్రాణం విత్తనమే. విత్తులో సత్తువ ఉంటేనే పొలంలోను, రైతు ముఖంలోనూ కళకళ.. లేకుంటే పెట్టుబడులు, శ్రమ అంతా నష్టపోయి దివాలా. నాణ్యమైన విత్తనాలు నాటితే సరైన దిగుబడులు సాధ్యమై రైతుకు గిట్టుబాటు అవుతుంది. అంతా బాగున్నా కరవు రూపంలోనో, తుపాన్లు, వరదల రూపంలోనో ప్రకృతి పగబడితే చేయగలిగేదేమీ ఉండదు.. కానీ, విత్తే పెను విపత్తయితే రైతు చిత్తు కావాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు ఇప్పుడు విత్తనాలే పెద్ద సమస్యగా మారిపోయాయి. ఏవి అసలైనవో, ఏవి నకిలీవో చెప్పలేని పరిస్థితి. మార్కెట్‌ను ముంచెత్తుతున్న విత్తనాలలో ఏవి కొనాలో, ఏవి కొనొద్దో ఎవరూ చెప్పలేని అయోమయ స్థితి. ఎందుకీ దుస్థితి? లోపమెక్కడ? కళ్ల ముందు కుప్పలుగా కనిపిస్తున్న విత్తనాలలో సరైనవి ఎంచుకోలేని రైతుది పొరపాటా. నకిలీలు, అనధికారిక సంస్థలు, ఏ ధ్రువీకరణ లేకుండానే విత్తన వ్యాపారం సాగిస్తున్న సంస్థలకు అడ్డుకట్ట వేయలేని అధికార వ్యవస్థది తప్పా?...తెలుగు రాష్ట్రాల్లో ఏటా నాసిరకం విత్తనాలతో నట్టేట మునుగుతున్న రైతుల కష్టాలపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం..

పంట వేసిన తరువాత దాని పెరుగుదల, దిగుబడులు చూసేవరకు విత్తనం నాణ్యమైనదా? నాసిరకమైనదా? తెలియదు. కానీ, అప్పటికే రైతులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెడుతున్నారు. పొలం సిద్ధం చేయడానికి, విత్తనాలకు, ఎరువులకు, నీళ్లకు, కూలీలకు... ఇలా భారీగా ఖర్చు చేస్తున్నారు. అంతా చేశాక పంట ఎదగకపోతే మోసపోయామని గుర్తించి దిగాలు పడుతున్నారు. చేసిన అప్పులు తీర్చడమెలాగో తెలియక తల్లడిల్లుతున్నారు. విత్తన కంపెనీలపై ప్రభుత్వానికి, వ్యవసాయశాఖలకు నియంత్రణ లేకపోవడం ఏటా రైతులు ఇలానే నష్టపోతు న్నారు. పనికిరాని విత్తనాలతో సాగు ప్రారంభించి, పెట్టుబడులు పెట్టి లక్షల రూపాయలను కోల్పోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నకిలీ, నాసిరకం బీటీ పత్తి విత్తనాల వ్యాపారం పెద్దయెత్తున సాగుతోంది. అధికారుల దాడుల్లో తరచూ నకిలీ విత్తనాలను పట్టుకుంటున్నారు. అయినా.. ఈ దందాకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో నకిలీ, నాసిరకం బీటీ పత్తి విత్తనాల వ్యాపారం పెద్దయెత్తున సాగుతోంది. అధికారుల దాడుల్లో తరచూ నకిలీ విత్తనాలను పట్టుకుంటున్నారు. అయినా.. ఈ దందాకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు.

                                                           మొలక శాతమే కీలకం

వ్యవసాయ ప్రమాణాల ప్రకారం 100 విత్తనాలలో కనీసం 75 మొలకెత్తితేనే అవి నాణ్యమైనవి. స్వచ్ఛత, తేమ, మొలక శాతం సరిగా ఉన్నదీ లేనిదీ ప్రయోగశాలలో పరీక్షించిన తరవాతే విక్రయాల కోసం మార్కెట్లో ప్రవేశపెట్టాలి. అయితే.. కొన్ని రకాల నకిలీ విత్తనాలు మొలకెత్తి, ఎరువుల వల్ల మొక్కలు ఏపుగా పెరిగినా కూడా పూత, కాత రాక రైతులు నిండా మునిగిపోతున్నారు. గతేడాది మినుము, సోయాచిక్కుడు, బీటీ పత్తి, వరి, మిరప, కూరగాయల విత్తనాలు నాసిరకమైనవి అమ్మడంతో తెలంగాణ జిల్లాల్లో వందలాది మంది రైతులు నష్టపోయారు.

                                                       లోపమెక్కడుంది?

* నాసిరకం విత్తనాలు రాజ్యమేలడానికి ప్రభుత్వాల విధానాలు, నిర్ణయాలే ప్రధాన కారణం.
* తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం తరఫున రైతులతో విత్తన పంటలు పండించి, శుద్ధి, నిల్వ చేయడానికి ఉన్న సంస్థలు: 4 (రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(మార్క్‌ఫెడ్‌), రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య(ఆయిల్‌ఫెడ్‌), హాకా).
* దీంతోపాటు వ్యవసాయ శాఖలు నేరుగా విత్తన గ్రామం పథకంలో రైతులతో విత్తన పంటలు సాగుచేయిస్తున్నాయి.
* ఇవన్నీ సక్రమంగా సాగితే నాసిరకాలను పూర్తిగా అరికట్టొచ్చు. కానీ ఈ సంస్థలు విత్తన పంటలు సాగుచేయించడం.. తిరిగి సకాలంలో కొనడంలో పూర్తిగా విఫలమవడం వల్ల ప్రైవేటు సంస్థల వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది.

ప్రణాళిక లోపమే పెను శాపం

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌కు తెలంగాణలో సోయాచిక్కుడు విత్తనాలను మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర సంస్థలు సరఫరా చేస్తున్నాయి. టెండర్లు పిలిచి వీటిని ఎంపిక చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విత్తనాభివృద్ధి సంస్థకు గత డిసెంబరులోనే నిధులు కేటాయించి అప్పుడే రైతుల నుంచి విత్తన పంటను కొనేలా చేసి శుద్ధి, నిల్వ చేస్తే తక్కువ ధరకు, సకాలంలో రైతులకు విత్తనాలు లభ్యమయ్యేవి. అప్పుడు సోయాచిక్కుడు క్వింటాలు ధర రూ.2750 ఉండగా నిధుల్లేక కొనుగోలు చేయలేదు. ప్రైవేటు సంస్థలు కొని నిల్వ చేసుకుని ఇప్పుడు రెట్టింపు ధరకు ప్రభుత్వానికి విక్రయిస్తున్నాయి. వ్యవసాయ శాఖ వాటినే రైతులకు రాయితీపై అందిస్తోంది. వేరుసెనగ, కంది, మినుము.. వంటి అన్నిటి విషయంలోనూ ఇలాగే జరుగుతోంది. సరఫరా చేసే సంస్థలకు చెల్లింపులు చేయడానికి గాను విత్తనాభివృద్ధి సంస్థకు ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయడం లేదు. దీంతో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ గత ఏడాది తన ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ.100కోట్లకు పైగా అప్పులు తీసుకుని ప్రైవేటు విత్తన సంస్థలకు బకాయిలు చెల్లించింది.

సాధారణ పంటనే కొని..

ప్రభుత్వం ఆలస్యంగా నిధులివ్వడాన్ని ఆసరా చేసుకుని ప్రైవేటు విత్తన సంస్థలు సాధారణ పంటనే మార్కెట్‌లో రైతుల వద్ద కొని అవే నాణ్యమైన విత్తనాలుగా అందమైన ప్యాకింగుల్లో రెట్టింపు ధరలకు విక్రయించి కోట్లు ఆర్జిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలు, పలువురు రాజకీయ నేతలకు బినామీలుగా వ్యాపారులు పనిచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాయలసీమ కేంద్రంగా సాగే వేరుసెనగ విత్తన వ్యాపారంలో పలువురు ప్రముఖ నేతలకు వాటాలు అందుతున్నాయన్న విమర్శలున్నాయి. తెలంగాణలో అధిక డిమాండు ఉన్న సోయాచిక్కుడును ప్రభుత్వ విత్తన సంస్థలకు సరఫరా చేస్తున్న ప్రయివేటు కంపెనీలు మధ్యప్రదేశ్‌లో సాధారణ పంటనే కొనుగోలు చేసి ఇస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.

                                                           పరీక్షలు డొల్ల..

వ్యవసాయశాఖ నిర్వహించే విత్తన పరీక్షలు డొల్ల చందమే. ఒక దుకాణంలో వంద రకాలు విక్రయిస్తుంటే వీరు రెండు మూడు ప్యాకెట్లనే ప్రయోగశాలలకు పంపిస్తున్నారు. అదీ విత్తన అమ్మకాలు ముమ్మరంగా జరిగే మే, జూన్‌ నెలల్లోనే. వాటి ఫలితాలు రావడానికి నెలపైనే పడుతోంది. ఈలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. నాణ్యతపై అనుమానం వస్తే అమ్మకాలను నిలుపుదల చేసి, ఫలితాలు అనుకూలంగా వచ్చాక అనుమతించే అధికారం వ్యవసాయ అధికారులకు ఉన్నా విస్మరిస్తున్నారు.

ఏడేళ్లు పరీక్షించాలి..
అయినా, ఏడాదికో వంగడం
పరిశోధన క్షేత్రంలో తయారయ్యే విత్తనం వివిధ దశల్లో పరీక్షలు పూర్తి చేసుకుని పొలానికి చేరాలంటే ఏడేళ్లు పడుతుంది. తెగుళ్లు తట్టుకుని, అధిక దిగుబడులు ఇచ్చేలా ఉంటేనే దాన్ని మార్కెట్లోకి విడుదల చేయాలి. అయినా ప్రైవేటు సంస్థలు ఏడాదికో కొత్త వంగడాన్ని తీసుకొస్తున్నాయి. ఇందులో ఏది ఎక్కువ దిగుబడినిస్తుంది.. ఎక్కడ పరీక్షలు నిర్వహించారనే వివరాలూ వ్యవసాయశాఖ వద్ద ఉండటం లేదు.

డీఎన్‌ఏ ప్రయోగశాలలో గుర్తించినా..

నకిలీ, నాసిరకం విత్తనాలను గుర్తించడానికి ఉమ్మడి ఏపీ రాష్ట్రమున్నప్పుడే వ్యవసాయశాఖ మలక్‌పేటలో ఆధునాతన పరిజ్ఞానంతో విత్తన డీఎన్‌ఏ పరీక్షల ప్రయోగశాల ఏర్పాటుచేసింది. పలు కంపెనీల విత్తనాలు నాసిరకం అని, నకిలీవి అమ్ముతున్నట్లు ఈ ప్రయోగశాలలో ఏటా గుర్తిస్తున్నారు. అయినా సంబంధిత కంపెనీలపై చర్యలే లేవు.

                                            సంస్థలకు వరం.. రైతులకు శాపం

విత్తన పంటలు సాగుచేయించే సంస్థలు ‘రాష్ట్ర విత్తన ధ్రువీకరణ ఏజెన్సీ’(ఎస్‌సీఏ) వద్ద ఆరంభంలోనే పంట వివరాలు, పండించే రైతుల పేర్లు సహా నమోదు చేయించాలనే నిబంధన తప్పనిసరి చేస్తే నాసిరకం, నకిలీ విత్తనాలను అరికట్టొచ్చు. కానీ విత్తన చట్టంలో ఈ నమోదును ఐచ్ఛికంగా(ఆప్షనల్‌) పేర్కొన్నారు. పైగా సంస్థ సొంత ధ్రువీకరణ లేబుల్‌ అతికించి విక్రయించుకోవచ్చన్న వెసులుబాటు ఉంది. ఇదే ఇలాంటి సంస్థలకు వరంగా మారి.. రైతులకు శాపమైంది. మన పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ వంటి దేశాల్లో సైతం ప్రధాన పంటల విత్తనాల విక్రయదారులు ప్రభుత్వం నుంచి నాణ్యత ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా పొందాలనే నిబంధన ఉంది. బీటీ పత్తి విత్తనాలకు పాకిస్థాన్‌లో ఇలాంటి ధ్రువీకరణ తప్పనిసరి. కానీ, భారత్‌లో బీటీ పత్తి విత్తనాల నాణ్యతపై నియంత్రణ లేకపోవడంతో కర్షకులు నష్టపోతున్నారు.

ఎవరికీ తెలియని విత్తనక్షేత్రాల చిరునామా..
విత్తనం ఎక్కడ ఉత్పత్తి అయింది, పండించిన రైతు ఎవరు? అనే పూర్తి వివరాలు తయారీ సంస్థ వద్ద ఉండాలి. అయితే వ్యాపారుల వద్ద కొనుగోలు చేస్తుండటంతో ఏదో ఒక పేరు రాసి ఇచ్చేస్తున్నారు. విత్తన క్షేత్రాలను జియోట్యాగింగ్‌ చేయడం ద్వారా నకిలీలను నియంత్రించొచ్చు. అయితే అధికారులు ఫొటోలు తీస్తున్నామని సరిపెడుతున్నారు. ఏపీలో వచ్చే ఏడాది నుంచి తప్పనిసరిగా జియోట్యాగింగ్‌ ఉన్నతాధికారులు నిర్ణయించారు.


పట్టుకుంటున్నా ఫలితం సున్నా..

* గత నెల 17న తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గద్దెరాగడిలో రూ.కోటి విలువైన 30 క్వింటాళ్ల నకిలీ బీటీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు. స్థానిక ఎరువుల దుకాణం యజమాని ఒకరు గుజరాత్‌ నుంచి వాటిని తెప్పించి నిల్వ చేశాడు.
* గత నెల 19న అదే జిల్లా కాసిపేట మండలం మల్కపల్లిలో నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు. జైపూర్‌ మండలం శెట్‌పల్లిలో ఓ రైతు ద్వారా కొన్ని విత్తన సంస్థలు 1.80 లక్షల ప్యాకెట్ల నాసిరకం విత్తనాలు విక్రయింపజేస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం ఆదిలాబాద్‌ జిల్లాలోనూ ఇలాగే భారీగా దొరికాయి.
* విత్తనాలే కాకుండా వాటి ధ్రువీకరణకు వినియోగించే ప్రభుత్వ లేబుళ్లను సైతం నకిలీవే అతికిస్తున్నాయి బోగస్‌ సంస్థలు. ఇటీవల హుజురాబాద్‌లో తెలంగాణ విత్తన ధ్రువీకరణ ఏజెన్సీ అధికారులు ఇలాంటి లేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు.
* మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నదీ ప్రాంతాల మీదుగా ఆదిలాబాద్‌ జిల్లా పల్లెలకు, అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి బీటీ పత్తి విత్తనాలు తరలిస్తున్నారు. కొందరు వ్యాపారులు ప్రముఖ సంస్థల పేరుతో నకిలీ ప్యాకింగుల్లో నాసిరకం విత్తనాలు నింపి విక్రయిస్తున్నారు.
* ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో రూ.60 లక్షల విలువైన నకిలీ విత్తనాలు పట్టుకున్నారు.


భారీ స్థాయిలో వ్యాపారం

పత్తి, మిరప విత్తనాల కొనుగోలుకు రైతులు ఏటా ఖర్చు చేస్తున్నది....రూ.1,500 కోట్లు
కూరగాయలు, వరి, మొక్కజొన్న, జొన్న, కంది.................................రూ.350 కోట్లు
* తెలుగు రాష్ట్రాల్లో అధికంగా పెట్టుబడి పెట్టే పంటల్లో మిరప అగ్రస్థానంలో ఉంటుంది. ఎకరాకు రూ.లక్షన్నర వరకు ఖర్చవుతోంది. గతేడాది 6 లక్షల ఎకరాల్లో మిరప వేస్తే ఇందులో 80 శాతం హైబ్రిడ్‌ రకాలే. అన్నీ ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సిందే. ఎకరాకు(వంద గ్రాముల విత్తనం) కొనడానికే రైతులకు రూ.5,500 నుంచి రూ.12వేల మధ్య అయింది. సగటున రూ.7వేల చొప్పున చూసినా 6 లక్షల ఎకరాలకు రైతులు రూ.420కోట్లు విత్తనానికే చెల్లించారు.
* పత్తికి ఎకరాకు రూ.30వేల వరకు పెట్టుబడి అవుతుంది. బీటీ రకాలు ప్రవేశించాక విత్తనం ప్రైవేటు వ్యాపారుల నుంచి కొనుక్కోవాల్సిందే. రాష్ట్రంలో ఈ ఏడాది సాగు విస్తీర్ణం 55 లక్షల ఎకరాలకు చేరుకుంటుందని అంచనా. సాధారణంగా రైతులు ఎకరాకు 2 ప్యాకెట్ల విత్తనం వేస్తారు. అంటే ఎకరాకు రూ.1600 అవుతుంది. ఈ లెక్కన పత్తి విత్తనాలకు రైతులు పెట్టాల్సిన ఖర్చే రూ.880కోట్ల వరకు ఉంటుంది.

నాసిరకాలను నిలువరించాలంటే..

* ప్రతి విత్తన రకానికీ విక్రయానికి ముందే బ్యాచ్‌ల వారీగా నమూనాలు తీయాలి.
* మొలక శాతం, నాణ్యత వివరాలు వారంలోగా అందే ఏర్పాట్లు చేయాలి.
* అన్నీ సక్రమంగా ఉంటేనే అమ్మకానికి అనుమతించాలి.
* దుకాణాలు, గ్రామాల వద్ద బోర్డుల్లో వాటిని ప్రదర్శించాలి.
* నాసిరకమని తేలితే రైతుకు చేరకుండా నిరోధించాలి.
* రైతులకు వ్యవసాయశాఖ అవగాహన కల్పించాలి.
* రాష్ట్ర ప్రభుత్వ విత్తన ఏజెన్సీ ధ్రువీకరణను తప్పనిసరి చేయాలి.

రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు

* విడి విత్తనాలు కొనుగోలు చేయొద్దు
* రాష్ట్ర విత్తన ధ్రువీకరణ ఏజెన్సీ నుంచి ధ్రువీకరణ పత్రం ఉన్నవి కొనడం మేలు.
* కొనుగోలు తరువాత దుకాణ యజమాని సంతకంతో రశీదు తీసుకోవాలి.
* ఆ రశీదును, ఖాళీ విత్తన ప్యాకెట్ ను పంట పూర్తిగా చేతికొచ్చేవరకు తప్పనిసరిగా భద్రపరచాలి.
* విత్తన ప్యాకెట్‌పై కంపెనీ వివరాలు, చిరునామా అన్నీ పూర్తిగా ఉండాలి.
* నాసిరకం పాలిథీన్‌ సంచుల్లో ఉన్నవి కొనుగోలు చేయొద్దు.
* విత్తనాలు ఏఏ భూముల్లో పండుతాయనే వివరాలున్నాయా లేదా చూడాలి.
* వ్యాపారికి విత్తనాలు అమ్మే లైసెన్సు ఉందో లేదో చూడాలి.

Source:

http://www.eenadu.net/news/news.aspx?item=main-news&no=5


Leave a comment

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.